ఒక రోజున రాజైన విశ్వామిత్రుడు మంత్రులతో సహా వేటకై బయలుదేరాడు. అడవిలో దప్పికగొని వారంతా వసిష్ఠ మహర్షి ఆశ్రమానికి చేరుకొన్నారు.
వసిష్ఠుడు విశ్వామిత్రునికి స్వాగతం పలికాడు. ఆశ్రమంలో ఒక కామధేనువగు గోవు ఉంది. దాని పేరు నందిని. అది కోరిన కోరికలనన్నింటినీ నెరవేరుస్తూ ఉండేది. వసిష్ఠుడు వారికి తగిన ఆహార పానీయాలను, చాలా విలువైన రత్నాలను, వస్త్రాలు మొదలగు ఏ ఏ వస్తువులు కావాలని కోరాడో వాటినన్నింటినీ కామధేనువు ఇచ్చింది. మహర్షి వాటినన్నింటినీ విశ్వామిత్రుని కిచ్చి సత్కరించాడు. దీనిని చూసిన విశ్వామిత్రుడు ఆశ్చర్యపడి ఇట్లన్నాడు : ‘‘బ్రాహ్మణోత్తమా ! మీరు 10 కోట్ల ఆవులను లేదా మొత్తం సామ్రాజ్యాన్నంతటినీ తీసుకొని ఈ నందినిని నాకు ఇచ్చేయండి.’’
వసిష్ఠుడు : ‘‘దేవతల యొక్క, అతిథుల యొక్క మరియు పితరుల పూజ కొరకు అలాగే యజ్ఞానికి కావలసిన హవిస్సులు మొదలగు వాటికై ఈ ధేనువు ఇక్కడ వసిస్తూ ఉంది. నీ సామ్రాజ్యాన్నంతటినీ ఇచ్చినప్పటికీ దీనిని ఇవ్వడం సాధ్యపడదు.’’
‘‘నేను దీనిని బలపూర్వకంగా తీసుకువెళ్తాను. నా బాహుబలాన్ని చూపించే అధికారం నాకు ఉంది.’’
‘‘నువ్వు రాజువు, బాహుబలంపై భరోసా కలిగి ఉండే క్షత్రియుడివి. కాబట్టి నీ ఇష్టం ఎలాగైతే అలాగే చెయ్యి.’’
విశ్వామిత్రుడు బలవంతంగా ఆ గోవును అపహరించుకొని దానిని కొట్టుకొంటూ తీసుకు వెళ్ళాలనే ప్రయత్నం చెయ్యసాగాడు. నందిని విశ్వామిత్రుని భయంతో అరుస్తూ వసిష్ఠుని శరణుకు చేరుకొంది. దానిపై దెబ్బలు పడుతున్నప్పటికీ అది ఆశ్రమాన్ని విడిచిపెట్టి మరొకచోటుకు వెళ్ళలేదు.
వసిష్ఠుడు : ‘‘కల్యాణమయీ ! నేను నీ ఆర్తనాదాన్ని వింటూ ఉన్నాను. కానీ ఏమి చెయ్యగలను ? విశ్వామిత్రుడు నిన్ను బలవంతంగా అపహరించి తీసుకువెళ్తూ ఉన్నాడు. నేను ఏం చెయ్యగలను ? నేను సహనశీలం గల ఒక బ్రాహ్మణుడను.’’
నందిని వసిష్ఠుడిని ఇలా ప్రార్థించింది : ‘‘స్వామీ ! విశ్వామిత్రుని సైనికులు నన్ను కొరడాలతో కొడుతూ ఉన్నారు. నేను అనాథ వలె ఆక్రందన చేస్తూ ఉన్నాను. మీరు ఎందుకు నన్ను ఉపేక్షిస్తూ ఉన్నారు ?’’
వసిష్ఠుడు : ‘‘క్షత్రియుల యొక్క బలం వారి యొక్క పరాక్రమమే. బ్రాహ్మణుల యొక్క బలం సహనం. నేను సహన గుణాన్ని అనుసరిస్తూ ఉన్నాను. అందువల్ల నీకు ఇష్టమైతే వారి వెంట వెళ్ళవచ్చు.’’
నందిని : ‘‘స్వామీ ! ఏమిటి మీరు నన్నువదిలివేశారా ? మీరు నన్ను వదిలివేయనట్లయితే బలవంతంగా నన్ను ఎవ్వరూ తీసుకు వెళ్ళలేరు.’’
‘‘నేను నిన్ను వదిలిపెట్టలేదు. నువ్వు ఇక్కడే ఉండగలిగితే ఉండు.’’
ఆ మాట వింటూనే నందిని కోపంతో ఊగిపోతూ తన శరీరం నుండి మ్లేచ్ఛ సైనికులను సృష్టించింది. వారు అన్ని విధాలైన ఆయుధాలను, కవచాదులను ధరించి ఉన్నారు. చూస్తూ ఉండగానే వారంతా విశ్వామిత్రుని సైన్యాన్ని చెల్లాచెదురు చేసేశారు. అస్త్రశస్ర్తాల దాడితో గాయపడిన సైనికులు తమ కాళ్ళకు బుద్ధి చెబుతూ పారిపోయారు. నందిని వాళ్ళను మూడు యోజనాల దాకా పారిపోయేటట్లు చేసింది.
ఇది చూసిన విశ్వామిత్రుడు బాణాల వర్షం కురిపించసాగాడు. కానీ వసిష్ఠుడు వాటినన్నింటినీ వెదురు కర్రలతోనే నశింపజేశాడు. వసిష్ఠుని యుద్ధ కౌశలాన్ని చూసి విశ్వామిత్రుడు ఆగ్నేయాస్త్రం వంటి దివ్య అస్త్రాలను ప్రయోగించసాగాడు. అవి అన్నీ నిప్పులను విరజిమ్ముతూ వసిష్ఠునిపైకి రాసాగాయి. కానీ వసిష్ఠుడు బ్రహ్మబలంతో ప్రేరితమగు వెదురకర్రల ద్వారా ఆ దివ్య అస్త్రాలనన్నింటినీ కూడా వెనక్కు తిరిగి పంపాడు.
తరువాత వసిష్ఠుడు ఇట్లన్నాడు : ‘‘దురాత్మ గాధినందనా ! ఇప్పుడు నువ్వు పరాజితుడవయ్యావు. నీలో ఇంకా ఏదైసా ఉత్తమ పరాక్రమం మిగిలి ఉంటే నాపైన ప్రయోగించు’’ అని సవాలు చేస్తూ ఉన్నప్పటికీ విశ్వామిత్రుడు సిగ్గుతో ఏమీ మాట్లాడలేకపోయాడు. బ్రహ్మతేజస్సు యొక్క ఆశ్చర్యాన్ని కలిగించే అద్భుతాన్ని చూసి విశ్వామిత్రుడు క్షత్రి యత్వంతో ఖిన్నుడై, ఉదాసీనుడై ఇట్లన్నాడు : ధిగ్ బలం క్షత్రియబలం బ్రహ్మతేజోబలం బలమ్ ‘క్షత్రియ బలం పేరుకు మాత్రమే బలం, దానిని నిరసిస్తున్నాను ! బ్రహ్మతేజమ్ వల్ల కలిగే బలమే నిజమైన బలం.’ అని తలంచి విశ్వామిత్రుడు రాజ్యాన్ని విడిచిపెట్టి తపస్సు చెయ్యడం మొదలుపెట్టాడు.